ఫ్లాష్ న్యూస్ : దివంగత నటి శ్రీదేవికి జాతీయ అవార్డు!

Friday, April 13th, 2018, 02:48:46 PM IST

దివంగత అందాల నటి శ్రీదేవిభౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె చేసిన సినిమాలు, ఆమె పోషించిన పాత్రలు మన గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయనే చెప్పాలి. ఒకప్పుడు సావిత్రి గారి నటనకు ఎంత పేరు ఉందొ, అలానే ఆతర్వాతి తరంలో శ్రీదేవి కూడా అంతటి ఘన కీర్తిని గడించారు. ఆమె మరణించి ఇప్పటికి నెలన్నర అవుతోంది. అయితే ఆమె మరణానికి ముందు చివరిగా నటించిన మామ్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అద్భుత నటనకు గాను ఆమెకి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. అయితే ఈ విషయాన్ని రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇండియాలోని అద్భుత నటుల్లో శ్రీదేవి ఒకరని, ఆమెకు ఈ అవార్డు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు.

‘మామ్’ చిత్రానికి తాను కూడా పని చేశానని, ఆ అవకాశం తనకు లభించడం, ఇప్పుడు శ్రీదేవికి ఈ అవార్డు రావడంతో గర్వపడుతున్నానని తెలిపారు. కాగా శ్రీదేవి నటనకు గాను జాతీయ అవార్డు లభించడంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రం విడుదల తర్వాత చాలామంది ఆమెకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని భావించారని, చివరకు ఆ కల నిజమయ్యే సమయానికి ఆమె మన మధ్య లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…..