రెహమాన్ తాళం.. విజయ్ గానం

Wednesday, March 28th, 2018, 08:18:16 PM IST

ప్రముఖ చలన చిత్ర దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కత్తి’, ‘తుపాకీ’ వంటి సూపర్‌హిట్స్‌ లాంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో అభిమానులకు వచ్చే సినిమా మీద ఊహాగానాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయమొకటి ప్రస్తుతం కోలీవుడ్‌లో గింగిరాలు తిరుగుతుంది. ఈ సినిమాలో ఓ గీతాన్ని హీరో విజయ్‌ ఆలపించబోతున్నారని అంటున్నారు. గతంలో ఆయన చాలా సూపర్‌హిట్‌ పాటలు పాడినా.. రెహమాన్‌ స్వరసారథ్యంలో ఓ పాట పాడటం ఇదే తొలిసారి. దీంతో అభిమానులు మరింత థ్రిల్‌గా ఫీలవుతున్నారు.

కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. రాధారవి రాజకీయ నాయకుడిగా కన్పించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని సర్వత్రా సిద్దం చేస్తున్నారు. నవంబర్‌ 7న విడుదల తేదీగా ఖరారు చేశారని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.