ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డికి మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి?

Monday, June 3rd, 2019, 12:29:50 PM IST

స్థానికి సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస విజ‌య విహారం చేసింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కొంత నిరాశ ప‌రిచిన తెరాస స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మూడు స్థానాల్లోనూ విజ‌యం సాధించి ప్ర‌భంజ‌నం సృష్టించింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ని విశ్లేషించిన ప‌లువురు తెరాస ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మొద‌లైంది కాబ‌ట్టే అలాంటి ఫలితాలు వ‌చ్చాయ‌ని అంత‌టా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌చారాన్ని ప‌టా పంచ‌లు చేస్తూ స్థానికి సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస ఘ‌న విజ‌యం సాధించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

ఈ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీలుగా ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, తేరా చిన్న‌ప‌రెడ్డి, పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి గెలుపొందారు. న‌ల్ల‌గొండ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి ల‌క్ష్మిపై తెరాస అభ్య‌ర్థి తేరా చిన్న‌ప‌రెడ్డి విజ‌యం సాధించారు. చిన్న‌ప‌రెడ్డికి 610 ఓట్లు పోల‌వ్వ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 391 ఓట్లు పోలయ్యాయి. వ‌రంగ‌ల్ తెరాస అభ్య‌ర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డికి 827 ఓట్లు పోల‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి ఓట‌మిపాల‌య్యారు. అయితే ఆయ‌న‌కు తెరాస ఎమ్మెల్సీ టికెట్‌ని కేటాయించింది. రంగారెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిపై ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.