ట్రెండీ టాక్‌ : మున్నాభాయ్‌పై న్యూసెన్స్ కేసు!

Sunday, February 4th, 2018, 09:07:13 PM IST


మున్నాభాయ్ సంజ‌య్ ద‌త్‌పై ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ర‌మాయుధాలు క‌లిగి ఉన్నాడ‌న్న గొడ‌వ‌లో టాడా కేసు ఇప్ప‌టికీ భాయ్‌ని వెంబ‌డిస్తూనే ఉంది. అందుకు ఇప్ప‌టికే జైలు శిక్ష‌ను అనుభ‌వించి వ‌చ్చాడు. అయితే ఇప్ప‌టికే ఇలాంటి గొడ‌వ‌ల‌తో న‌లిగిపోయినా భాయ్‌లో ఎలాంటి మార్పు లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. తాను ఏం చేయాల‌నుకుంటే అది చేసి ఏదో ఒక ర‌కంగా పోలీస్ స్టేష‌న్ల‌కు ట‌చ్‌లోనే ఉంటున్నాడు.

సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం నివాసం ఉంటున్న ముంబై – ఖ‌ర్ లో త‌న ఇరుగుపొరుగు అత‌డిపై చాలా సీరియ‌స్‌గా ఉన్నారుట‌. అంతేకాదు నిన్న‌రాత్రి ఇంటి టెర్రాస్‌పై పార్టీ చేసుకున్న సంజ‌య్‌ద‌త్ హై ఫ్రీక్వెన్సీలో మైక్ పెట్టి స‌తాయించాడుట‌. అస‌లే 11.30కు పార్టీ ప్రారంభించి మిడ్‌నైట్ 1 గంట వ‌ర‌కూ లౌడ్ స్పీక‌ర్‌తో వాయించేశాడుట‌. దీంతో కునుకుప‌ట్ట‌ని ప‌క్కింటి ఆసామి సంజ‌య్‌ద‌త్‌పై పోలీస్ కేసు పెట్టాడు. ఖ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఆ మేర‌కు భాయ్‌పై కేసు న‌మోదైంది. వాస్త‌వానికి ఈ త‌ర‌హా గొడ‌వ‌లు ద‌త్‌కి కొత్తేమీ కాదు. గ‌త ఏడాది 20 రోజుల వ్య‌వ‌ధిలో రెండు సార్లు అత‌డి ఇంటికి పోలీసులు వ‌చ్చి వెళ్లారు. ఇదే త‌ర‌హాలో మైక్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నాడ‌ని ఇదివ‌ర‌కు కూడా ఫిర్యాదులు అందాయి. అయినా భాయ్‌లో మార్పు లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అలాగే విసిగిస్తున్నాడుట‌. దీంతో ఈసారి కాల‌నీ వాసులే యాన్యువ‌ల్ మీటింగులో ఏదో ఒక‌టి తేల్చేందుకు రెడీ అవుతున్నారట‌. నైట్ పార్టీలో మేడ మీద చిందులు.. బిగ్గ‌ర‌గా లౌడ్ స్పీక‌ర్ల గోల వీట‌న్నిటికీ చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట‌. ముంబై ఖ‌ర్ పోలీస్ స్టేష‌న్ ఎస్‌.ఐ.రామ‌చంద్ర జాద‌వ్ ప్ర‌స్తుతం ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.