విజయ్ దేవరకొండను వదలనంటున్న వివాదాలు.!

Wednesday, October 3rd, 2018, 10:25:16 PM IST


విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మెహ్రీన్ హీరోయిన్ గా రాజకీయ కథాంశంతో తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం “నోటా”.ఇప్పటికే అర్జున్ రెడ్డి చిత్రం విడుదలకు ముందు ఎలాంటి వివాదాల్లో చిక్కుకుందో,ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికి తెలుసు.ఇప్పుడు మళ్ళీ అదే వివాదాల్లో నోటా చిత్రం కూడా చిక్కుకుంది.ఈ చిత్రం రాజకీయ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఇది వరకే వివాదాలను చవి చూసింది.అవి అన్ని సర్దుమణిగి మళ్ళీ సినిమా విడుదల దగ్గర పడుతుందన్న సమయంలో మళ్ళీ కొత్త వివాదంలో చిక్కుంది ఈ చిత్రం.

తెలంగాణా రాష్ట్రంలోని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులకు సంబంధించిన కొన్ని అభ్యంతకర సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని,ఈసీ ఉపయోగించే “నోటా” అనే పదాన్ని ఎలాంటి అనుమతి తీసుకోకుండా చిత్రానికి టైటిల్ గా ఎలా పెడతారని తెలంగాణలోని కైలాష్ అనే విద్యార్థి నాయకుడు హైకోర్టులో పిటీషను దాఖలు చేశారు.ఈ చిత్రంలో అభ్యంతకర సన్నివేశాలు ఏవి లేవని కోర్టు వారు నిర్ధారించిన వరకు తెలంగాణలోని నోటా చిత్రాన్ని విడుదల చెయ్యకూడదని వారు బలంగా కోరుతున్నారు.ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఏవి లేవని ఇది వరకే విజయ్ చెప్పుకొచ్చినా ఇంకా ఇలా వివాదాలు రావడం బాధాకరమే అని చెప్పాలి.