అభిమాన ఆర్మీతో ఏడు రాష్ట్రాల్లో ఎదిగిన ఏకైక స్టార్‌?

Wednesday, April 11th, 2018, 10:41:24 PM IST

అస‌లు ఇత‌డేం హీరో అన్నారు. ప‌రిశ్ర‌మ‌ పెద్ద‌లే పెద‌వి విరిచేశారు. మెగా అండ‌దండ‌లున్నా హీరోగా ఎదుగుతాడా? అని వెట‌కార‌మాడారు. వెన‌క‌నుంచి చెవులు కొరుక్కోడాలు.. గుస‌గుస‌లాడుకోడాలు.. అయితే అన్నిటికీ ఒక‌టే విరుగుడు. ఒక‌టే పెర్ఫెక్ట్ ఆన్స‌ర్‌.. అదే హై ఎండ్ ప్ర‌తిభ‌. హైపంచ్‌ ఎన‌ర్జీ.. నాలుక మ‌డ‌త‌పెట్టిన వాడి న‌డ్డి విరిచే ఏకైక మంత్రం ట్యాలెంటు మాత్ర‌మే అని న‌మ్మాడు. దానికి హార్డ్‌వ‌ర్క్ తోడైంది. ఇంకేం ఉంది. న‌టించిన రెండో సినిమాతోనే అస‌లు ఆట మొద‌లైంది. దేశ‌ముదురు అంటే ఇత‌డొక్క‌డే అని నిరూపించాడు. అంచెలంచెలుగా ఎవ‌రూ అందుకోలేని రేంజుకు ఎదిగాడు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా అక్క‌డ త‌న‌కు అభిమానులు అనే ఆర్మీ ఏర్ప‌డ‌తార‌ని నాడు అత‌డు ఊహించి ఉండ‌డు. ఊహాతీతంగా అతడి ప్ర‌తిభ‌ను మెచ్చి అభిమానులు అండ‌గా నిలిచారు. ఎక్క‌డికి వెళ్లినా జేజేలు ప‌లికారు. ఆర్య ఆర్య అంటూ క‌ల‌వ‌రించారు. అందుకే ఈరోజు అత‌డికి ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా ఏడు రాష్ట్రాల్లో అసాధార‌ణ‌మైన అభిమానులు ఏర్పడ్డారు. అభిమాన సంఘాలు ఏర్ప‌డ్డాయి. ఇదంతా ఎవ‌రిగురించో పేరు ప్ర‌త్యేకించి ప్ర‌స్థావించ‌న‌వ‌స‌రం లేదు. అత‌డే బ‌న్ని. అల్లూ వార‌సుడిగా మెగా అండ‌దండ‌ల‌తో కెరీర్ ప్రారంభించినా, ఆరంభ‌మే అత‌డు త‌న‌ని తాను నిరూపించుకుని, త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని శిఖ‌రం ఎత్తుకు ఎదిగాడు. నేడు వంద కోట్ల క్ల‌బ్ హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు.

అస‌లు సిస‌లు ప్ర‌తిభ‌కు ఇదిగో ఇదే సాక్ష్యం. మొన్న‌టికి మొన్న పుట్టిన‌రోజు జ‌రుపుకున్న బ‌న్నికి ఏడు రాష్ట్రాల్లో అభిమానులు ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, కేర‌ళ‌, ఒడిస్సా, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌లో అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ఈ వేడుక‌లు అత్యంత వైభ‌వంగా సాగాయి. ప‌రిశ్ర‌మ‌లో వార‌స‌త్వ‌ పోక‌డ‌లు, అండ‌దండ‌లు కొంత‌వ‌ర‌కే. ఆ త‌ర‌వాత ఎద‌గాలంటే ప్ర‌తిభే గీటురాయి. అకుంఠిత ధీక్ష‌, అసాధార‌ణ హార్డ్‌వ‌ర్క్‌తో ఏదైనా సాధ్య‌మే ఇక్క‌డ‌. ఒక‌సారి అభిమానం ఏర్ప‌డితే అంత‌కంత‌కు పెరుగుతుందే కానీ త‌గ్గ‌దు అని నిరూప‌ణ అయ్యింది. ఈ స్థాయి నుంచి మ‌రో మైలు రాయిని అందుకునే దిశ‌గా అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడు. `నా పేరు సూర్య‌`తో అటు బాలీవుడ్‌ని షేకాడించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ గ్రేట్ జ‌ర్నీకి హ్యాట్సాఫ్ టు బ‌న్ని.

  •  
  •  
  •  
  •  

Comments