మన కులానికి భయం ఉండకూడదు..పవన్ పై ఆమంచి సంచలన వ్యాఖ్యలు

Tuesday, September 17th, 2019, 01:41:35 PM IST

గోదావరి జిల్లాల్లో గట్టి కాపునేతగా పేరున్న తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. దానిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాపు నేతలు జగన్ కి భయపడి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై తోట మాట్లాడుతూ నేను ఎవరికీ భయపడి పోవటం లేదు. జగన్ మీద నమ్మకంతో ఆయన పరిపాలన బాగా చేస్తానని నమ్మి వెళ్తున్న, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతమని నేను భావిస్తున్న అంటూ చెప్పాడు.

దీనిపై తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మాట్లాడుతూ ” కాపులు ఎవరు భయపడి వైసీపీ లోకి రావటం లేదు. దేన్నైనా ఎదురొడ్డి పోరాడడం మా కాపు కులం నైజమని, అలాంటిది భయపడి వచ్చారని చెప్పటం దారుణం. తోట ఆలా భయపడే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ కూడా మా కులానికి చెందిన నేత, మాలో ఉన్న రక్తమే ఆయనలో కూడా ఉండే ఉంటుంది. అలాంటిది కాపులు భయపడుతున్నారు అంటూ మాట్లాడి పరువు తీస్తున్నాడంటూ” ఆమంచి మాట్లాడాడు.

ఆమంచి మాట్లాడిన మాటలపై చాలా వర్గాల నుండి వ్యతిరేకత వస్తుంది. రాజకీయంలో కులం కార్డు అనేది ఉంటుంది కానీ , అది లోలోపల మాత్రమే జరుగుతుంది తప్పితే పైకి కనిపించదు. కానీ ఆమంచి ఏకంగా కులం పేరు ఎట్టి దాని గురించి మాట్లాడుతూ, కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమంచి ఒక పక్క ప్రణాళికతోనే పవన్ మీద అలాంటి కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. పవన్ కి కులం ముద్ర వేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమంచి ఆలా మాట్లాడి ఉండవచ్చు.