మా బాధలు కనబడవా.. వైఎస్ విజయమ్మకు రాజధాని మహిళల సూటి ప్రశ్న..!

Saturday, April 17th, 2021, 12:24:18 PM IST

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు రాజధాని రైతులు సూటి ప్రశ్న వేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 487వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల కోసం షర్మిల చేపట్టిన దీక్ష సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో కూతురుకు చిన్న గాయమైతే విజయమ్మ అల్లాడిపోయిందని అమరావతి రైతులను కుమారుడు సీఎం జగన్‌ ఎన్నో బాధలు పెడుతున్నా, వేధింపులకు గురిచేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని రాజధాని మహిళలు, రైతులు నిలదీశారు.

అయితే గత ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి జగన్‌ని గెలిపించాలని ప్రచారం చేసిన వైఎస్ విజయమ్మ అమరావతి రైతుల బాధలు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాలకులు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే 5 కోట్ల మంది ఆంధ్రులకు విలువ ఉంటుందా అని సీరియస్ అయ్యారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన పాపానికి 486 రోజుల నుంచి రోడ్ల మీద కొచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా రాజధాని తరలింపును ఆపాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు.