ఆయనో వాగ్దానాల బాబు..!

Monday, September 15th, 2014, 03:46:42 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలన అట్టర్ ప్లాప్ అయిందని..ప్లాప్ అయిన సినిమాను హిట్ అయినట్టు చెప్పుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బాబు వందరోజుల పాలనలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు తన ఖాతాలో వేసుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు. బొగ్గులేక ఇబ్బందులు పడుతూ చాలాచోట్ల విద్యుత్ ఉత్పత్తులు ఆగిపోతుంటే.. ఇరవైనాలుగు గంటలు వెలుగులు ఎక్కడినుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. హామీలు ఇవ్వడమే చంద్రబాబు నాయుడుకి తెలుసునని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో 200లకు పైగా, ఇక పాదయాత్రలో అయితే 300 హామీలు ఇచ్చారని.. ఈ హామీల అమలు సంగతి ఆ దేవుడికే తెలియాలని అంబటి రాంబాబు అన్నారు. రైతుల రుణాల మాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమయ్యాయో తెలియదన్నారు. రెండు రూపాయలకే మినరల్ వాటర్ పధకం పేపర్ కే పరిమితమయిందని.. ఆయన ఎద్దేవా చేశారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకమునుపే రాజధానిని ప్రకటించడం తెలుగుదేశం పార్టీ మంత్రులకే చెల్లిందని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి చెప్పుకుంటూ పొతే కొడవీటి చాంతాడంత ఉంటుందని ఆయన చమత్కరించారు.