అధికార వికేంద్రీకరణ కు బీజేపీ అనుమతి అవసరం లేదు–అంబటి రాంబాబు!

Sunday, January 26th, 2020, 09:29:47 AM IST

అధికార వికేంద్రీకరణ అంశం రాష్ట్రప్రభుత్వ నిర్ణయం అని, అందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అయితే రాజధాని అంశం రాష్ట్ర పరిథిలోనిది అని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మూడు రాజధానుల అంశం, హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమని వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని అన్నారు.

అధికార వికేంద్రీకరణ విషయం లో అంబటి రాంబాబు కొన్ని విషయాలని తెలియజేసారు. గ్రామ స్థాయి నుండి అధికార వికేంద్రీకరణ జరుగుతుంది అని తెలిపారు. ఇది కూడా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమని అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. అయితే ఈ సందర్భంగా రాయలసీమలోని హైకోర్టు నిర్మాణం గురించి అంబటి సంచలన వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు బీజేపీ చెప్పిన విషయాన్నీ అంబటి గుర్తు చేసారు. ఆ విషయానికి బీజేపీ నేతలు కట్టుబడి వున్నారో లేదో అన్న విషయం ప్రజలకు తెలియజేయాలి అని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బీజేపీ చెప్పిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు కి ఇంకా బీజేపీ అండదండలు దేనికి అని అన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు చంద్రబాబు కి అనుకూలంగా పని చేస్తున్నాయి అని సంచలన వ్యాక్యలు చేసారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉందని అంబటి రాంబాబు అన్నారు.