టాలీవుడ్‌పై ప‌డుతున్న గ‌జ‌దొంగ‌లు

Wednesday, September 26th, 2018, 01:31:28 PM IST

2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపుల‌రైంది `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌, క‌త్రిన‌, స‌నా షేక్ వంటి భారీ కాస్టింగ్ తో `ధూమ్ 3 ఫేం` విజ‌య్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 1839 కాలం నాటి `క‌న్ఫెష‌న్స్ ఆఫ్ థ‌గ్` న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాని తీస్తుండ‌డంతో నాడు బంధిపోట్ల హ‌వా ఎలా ఉంటుందో … ఊళ్ల‌పై ప‌డి ఎలా దోచుకునేవారో తెలుసుకోవాల్న కుతూహాలం మొద‌లైంది. స‌రిగ్గా ఇదే పాయింటును హాలీవుడ్ సాంకేతిక‌త‌తో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో అమీర్ – అమితాబ్ హీరోలుగా తెర‌కెక్కిస్తుండ‌డంతో ఆస‌క్తి ఇంకా ఇంకా రెయిజ్ అయ్యింది. ధూమ్ సిరీస్‌కి క‌థ‌లు అందించే విజ‌య్ కృష్ణ ఆచార్య‌, ధూమ్ 3 చిత్రంతో ద‌ర్శ‌కుడిగా అద‌ర‌గొట్టాడు. ఈసారి అంత‌కుమించి అద్భుతాన్ని, విజువల్ వండ‌ర్‌ని అత‌డు అందిస్తాడ‌న్న న‌మ్మకం అటు బాలీవుడ్‌లోనే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అత‌డి అభిమానుల్లో ఉంది. స‌రిగ్గా ఇలాంటి వేళ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` లాంటి భారీ చిత్రంతో ప్రాంతీయ భాష‌ల‌పైనా దండ‌యాత్ర ప్రారంభించాడు విజ‌య్ కృష్ణ ఆచార్య‌. ఇప్పుడు థ‌గ్స్ ని అనువ‌దించి తెలుగు, త‌మిళ్‌లోనూ రిలీజ్ చేస్తున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించేశారు.

“హ‌లో నా పేరు అమితాబ్ బ‌చ్చ‌న్ .. హ‌లో నా పేరు అమీర్ ఖాన్‌.. మేమిద్ద‌రం క‌లిసి మొద‌టి సారిగా మా నెక్ట్స్ మూవీ య‌శ్‌రాజ్ ఫిలింస్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`తో వ‌స్తున్నాం. ఈ స్పెష‌ల్ ఫిలింని మీతో షేర్ చేద్దామ‌నుకుంటున్నాం. ఈ దీపావ‌ళికి థ‌గ్స్ వ‌స్తున్నారు. సినిమా హాల్స్‌లో క‌లుద్దాం“ అంటూ అమితాబ్, అమీర్ స్వ‌యంగా బ‌రిలో దిగిపోయి ప్ర‌చారం చేయ‌డం చూస్తుంటే షాక్ తిన‌క మాన‌రు. హిందీ, తెలుగు, త‌మిళ వెర్ష‌న్ల‌ను దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడి ఈ థ‌గ్స్ గుండె కొల్ల‌గొట్టారు. ఇక‌పై వ‌సూళ్లు కొల్ల‌గొడ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.