కాంగ్రెస్ పార్టీకి ఇంకో దెబ్బ పడాల్సిందేనంటున్న అమిత్ షా

Tuesday, June 11th, 2019, 10:34:56 AM IST

మోడీ ఛరీష్మా, అమిత్ షా వ్యూహాలు కలిసి లోక్ సభ ఎన్నికల్లో భాజాపాకు అత్యధిక మెజారిటీని కట్టబెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాయి. దీంతో డీలాపడిన కాంగ్రెస్ ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కోలుకోవాలని చూస్తోంది. కానీ భాజాపా మాత్రం వారికి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ ఏడాదిలో ఆఖరులో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు అమిత్ షా.

మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రస్తుత అధికారం భాజాపాదే. కాంగ్రెస్ ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టాలనే ఉద్దేశ్యంతో అమిత్ షా మూడు రాష్ట్రాల నేతలతో విడివిడిగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రులందరికీ దిశా నిర్దేశం చేశారు. మిత్ర పక్షాలుగా కలిసొచ్చే పార్టీలను, ప్రస్తుతం పొత్తులో ఉన్న పార్టీలను కాపాడుకోవాలని సూచించారు. ఇక ఎన్నికలు జరగనున్న నాలుగో రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం భాజాపా రెండో స్థానంలో ఉండగా అక్కడ రాష్ట్రపతి పాలన నడుస్తోంది. దీని కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రచించాలని అమిత్ షా భావిస్తున్నారు.