నోరు జారిన కిషన్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్ !

Sunday, June 2nd, 2019, 01:37:44 PM IST

గత తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కిషన్ రెడ్డికి ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో పదవి దక్కింది. కీలక నేత అమిత్ షా డీల్ చేస్తున్న హోంశాఖలో సహాయమంత్రిగా ఉండే అవకాశం ఆయనకు దక్కింది. ఈ సువర్ణావకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కిషన్ రెడ్డి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఆరంభంలోనే అమిత్ షా నుండి చీవాట్లు తినాల్సి వచ్చింది.

కేంద్ర సహాయమంత్రి హోదాలో మీడియాతో మాట్లాడిన ఆయన టెర్రరిస్టులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అయిందని వ్యాఖ్యానించారు. స్వయంగా హోంశాఖ సహాయమంత్రిలో ఉన్న వ్యక్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జాతీయ మీడియా మొత్తం దృష్టిపెట్టి కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రముఖంగా ప్రస్తావించింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారా అంటూ మండిపడ్డారు. దీంతో అమిత్ షా వెంటనే కిషన్ రెడ్డికి ఫోన్ చేసి కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మెల్లగా మందలించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.