ఈ ఏడాది వరకు అమిత్ షానే నడిపిస్తారట

Friday, June 14th, 2019, 12:05:32 PM IST

అమిత్ షా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి, కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా చర్చ నడిచింది. పార్టీలోని అనేకమంది సీనియర్ల పేర్లు వినబడినా ఫైనల్ ఎవరనేది మాత్రం తేలలేదు. ఇక అమిత్ షా పదవి నుండి ఎప్పుడు తప్పుకుంటారనే విషయంపై కూడా మీమాంస నెలకొంది ఉండగా ఈ ఏడాది చివరి వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగుతారని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో 303 సీట్లతో భాజాపా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా ఈ ఏడాది ఆఖరులో హరియాణా, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల భాద్యతను కూడా తీసుకున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రస్తుత అధికారం భాజాపాదే. కాంగ్రెస్ ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టాలని మోడీ, అమిత్ షాలు నిర్ణయించుకున్నారు. అందుకే ఆ ఎన్నికల వరకు అమిత్ షానే అధ్యక్ష పదవిలో ఉండి పార్టీని నడపనున్నారు. అనంతరం 2020లో జరిగే సంస్థాగత ఎన్నికలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.