పెళ్లికూతుర‌వుతున్న జాతీయ ఉత్త‌మ‌ న‌టి

Thursday, February 15th, 2018, 10:58:19 PM IST

మ‌ణిర‌త్నం డిస్క‌వ‌రీ, `అమృత‌` ఫేం కీర్త‌న పెళ్లికూతురవుతోంది. మార్చి 8న క‌ళ్యాణానికి ముహూర్తం. ఇప్ప‌టికే శుభ‌లేఖ‌లు ప్రింట్ అయిపోయాయ‌ని తెలుస్తోంది. అస‌లింత‌కీ కీర్త‌న ఎవ‌రు? అంటే.. నాటి మేటి స్టార్స్‌ పార్తీబ‌న్ – సీత‌ల గారాల కుమార్తె. ఆ ఇద్ద‌రితో ఉన్న స్నేహం వ‌ల్ల మ‌ణిర‌త్నం త‌న‌ని బాల‌న‌టిగా ప‌రిచ‌యం చేశారు. కీర్త‌న‌కు చిన్న‌నాడే జాతీయ అవార్డు న‌టిని చేశారు. మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం `కన్నత్తిల్ ముత్తమిట్టల్` తెలుగులో `అమృత` పేరుతో రిలీజై కీర్త‌న‌కు ఇక్క‌డా మంచి గుర్తింపు తెచ్చింది. అవార్డులు, రివార్డుల్ని ఇచ్చింది.

కీర్త‌నను మ‌నువాడే కుర్రాడు.. ప్ర‌ముఖ సినీఎడిట‌ర్ శ్రీ‌క‌ర్‌ప్ర‌సాద్ త‌నయుడు అక్ష‌య్ ప్ర‌స్తుతం సినిమా ద‌ర్శ‌కుడిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఈ వివాహం వెన‌క మ‌రో ట్విస్టేమంటే… `అమృత` చిత్రానికి ఎడిటింగ్ చేసింది శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌. ఆయ‌న‌కే కోడ‌ల‌వుతోంది కీర్త‌న‌.