ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్ లో ఇస్తమా జరగ్గా, రాష్ట్రం నుంచి 711 మంది ఆ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. దేశ వ్యాప్తంగా రెండు వేల మంది ప్రార్థనల్లో పాల్గొనగా, ఏపీ నుంచి ఏడు వందలకు పైగా అక్కడకు వెళ్లారు అని వ్యాఖ్యానించారు. ఆ ప్రార్థనల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా సోకిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు అని అన్నారు. దాదాపు అందరికీ రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామనీ తెలిపారు. అయితే వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనకు వెళ్లిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు, వారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారు అను తెలిపారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ప్రజలందరి ఆరోగ్యం కోసం మీరంతా బయటకు రావాలనీ అన్నారు. దేవుడి దయవల్ల కరోనా వైరస్ వల్ల మన రాష్ట్రంలో ఎవరూ మరణించలేదని, జిల్లా వ్యాప్తంగా 138 మంది శ్యాంపిల్స్ ల్యాబ్‌కు పంపగా, 65 మందికి నెగిటివ్ వచ్చిందన చెప్పారు.