సీఎం జగన్‌కి ఇదే నా సవాల్.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంచలనం..!

Monday, October 21st, 2019, 07:23:18 PM IST

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, అవినీతిని నిర్మూలించే పనిలో జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణకు కూడా మరోసారి జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖలోని పరదేశిపాలెంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు చెందిన ఆమోదా పబ్లికేషన్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన ఎకరంన్నర భూమిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ భూమి విలువ సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుందని రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ప్రభుత్వం వారికి ఈ భూమి కట్టబెట్టిందని జగన్ సర్కార్ ఆరోపించింది. అయితే జగన్ నిర్ణయంపై స్పందించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ విషయంలో జగన్‌కి బిగ్ సవాల్ విసిరారు. అయితే 1986లో అప్పటి ప్రభుత్వం పలు పత్రికలకు విశాఖలో భూమిని కేటాయించిందని, తక్కువ ధరలకే భూమిని కేటాయించడం ఎప్పటి నుంచో జరుగుతుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కొన్ని మీడియా సంస్థలకు తక్కువ మొత్తానికే భూములు ఇచ్చారని రాధాక్రిష్ణ అన్నారు. అయితే తమ సంస్థకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం ఎకరా భూమిని తిరిగి తీసుకున్న కారణంగా అదే సర్వే నెంబర్‌లో పక్కనే ఉన్న భూమిని తిరిగి ఇచ్చారని తమకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమికి డబ్బు చెల్లించే అవసరం లేకున్నా 50 లక్షలు చెల్లించామని అయితే వైసీపీ నేతలు, వారి మీడియా కలిసి ఇది అక్రమ భూమి అని ప్రచారం చేసి, ఆ భూమిని రద్దు చేసిందని దానిని న్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు.

అయితే నిజంగా ఆ భూమి అక్రమమైతే దాని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం, దానిపై ప్రభుత్వానికి చెల్లించిన 50 లక్షలను కూడా వదులుకోవడానికి మేము సిద్దమేనని, అయితే సీఎం జగన్ 45 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని సీబీఐ నిరూపించింది కనుక ఆయన అక్రమ సంపాదనల మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడానికి సిద్దమేనా అని సవాల్ విసిరారు. అంతేకాదు అవినీతి కేసులలో విచారణ ఎదురుకుంటున్న వ్యక్తి ఇతరులపై అవినీతి మరక వేయాలనుకోవడం సబబు కాదని అన్నారు. అయితే రాధాకృష్ణ ఛాలెంజ్‌పై జగన్ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.