బ్రేకింగ్: తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగింపు..!

Tuesday, June 8th, 2021, 09:15:51 PM IST

Hyderabad_lockdown2

తెలంగాణలో లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజుల పాటు పొడిగించింది. నేడు మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించిన అనంతరం మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ఈ సారి మరికొంత పెంచారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ, ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చింది.

అయితే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇదిలా ఉంటే కరోనా అదుపులోకి రాని నియోజకవర్గాల్లో ప్రస్తుత లాక్‌డౌన్ కొనసాగించాలని ఆదేశించారు. మధిర, సత్తుపల్లి, నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులు ఉండనున్నాయి.