హైదరాబాద్ లో దారుణం : గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

Wednesday, March 25th, 2020, 02:29:44 PM IST

నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లల్లో, ఇంట్లోవాళ్లతో సంతోషంగా గడుపుతుంటే, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మాత్రం ఒక దారుణమైన విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కాగా కూకట్ పల్లి లోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా కర్ణాటకలోని కలబుర్గి జిల్లా రాళ్లగణపురానికి చెందిన తల్వార్ బిచ్చప్ప కూకట్ పల్లి లోని హౌసింగ్ బోర్డు పరిధి ఎన్ఆర్ఎస్ఏ కాలనీలోని ఉంటూ, అదే అపార్టుమెంట్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని కొడుకు మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే వంట చేసేందుకు బబిచ్చప్ప గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో అందులోనుండి గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. కాగా ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే తక్షణమే స్పందించిన స్థానికులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు అక్కడే మృతి చెందారు. దీంతో ఉగాది పండుగ నాడు ఒకే ఇంటికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.