కేసీఆర్‌కి మరో షాక్.. ఆ టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదట..!

Friday, October 18th, 2019, 07:39:48 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోయిన టీఆర్ఎస్ ఈ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి వరుసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో మాత్రం టీఆర్ఎస్ అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలకు గాను టీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకుంటే, బీజేపీ 4 స్థానలను, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను, మజ్లీస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.

అయితే టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు పదవులను ఆశించి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీనీ మరింత బలోపేతం చేయాలని భావించిన అధినేత కేసీఆర్‌కి పెద్ద షాక్ తగిలింది. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలయ్యింది. ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను బీబీ పాటిల్‌ వెల్లడించలేదని, నిబంధనలు పాటించని కారణంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్‌ మోహన్‌ రావు ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆరు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని బీబీ పాటిల్‌, ఎన్నికల కమిషన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.