ఆ జిల్లాలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి భారీ వలసలు..!

Sunday, October 20th, 2019, 05:18:42 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ మాత్రం ఎన్నడూలేని విధంగా ఓటమిపాలైంది. అయితే టీడీపీ తిరిగి కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో చాలా మంది నేతలు అధికారంలో ఉన్న వైసీపీలో చేరుతున్నారు.

అయితే తాజాగా నెల్లూరు రూరల్‌లో చాలా మంది టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరిపోయారు. జిల్లా వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ మండల కన్వీనర్ వేమిరెడ్డి ఆశోక్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షురాలు వేమిరెడ్డి కౌసల్యమ్మ, ఆమంచర్ల గ్రామనాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, రూరల్ మండల ఉపాధ్యక్షులు పులి రాం గోపాల్‌తో పాటు పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే సీఎం జగన్ అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై మేమంతా వైసీపీలో చేరామని, పార్టీనీ, జగన్ అభివృద్ధి పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.