టీఎస్ ఆర్టీసీలో మరో కొత్త విధానం.. యూనియన్లు లేనట్టేగా..!

Friday, December 13th, 2019, 05:49:39 PM IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగిశాక కార్మికుల కోసం ఆర్టీసీలో కేసీఆర్ సర్కార్ పలు కీలక మార్పులు తీసుకురాబోతుంది. అందులోనే భాగంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డ్‌ను ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోల నుంచి డిపోకు ఇద్దరు చొప్పున, మూడు వర్క్ షాపుల నుంచి మరో ఇద్దరు చొప్పున మొత్తం 200 మందితో బోర్డ్‌ను కొనసాగించబోతున్నారు. అయితే ఇందులోని సభ్యులను డిపో మేనేజర్ సెలెక్ట్ చేసి, రీజీయన్ మేనేజర్‌కి పంపిస్తారు.

అయితే ఈ బోర్డ్ ఏర్పాటులో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తైనట్టు, మరో వారం రోజులలో దీనిని అమలు చేయనున్నట్టు సమాచారం. అయితే దీనితో పాటు ప్రతి డిపోలో ఎంప్లాయిస్ బాక్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులు తమ సమస్యలను, ఫిర్యాదులను తెలిపేందుకు ఈ బాక్స్‌ను వినియోగించుకోవచ్చని ప్రతి ఫిర్యాదును పరిశీలించేందుకు బస్ భవన్‌లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే ఇక మీదట ఆర్టీసీలో అసలు యూనియన్ అనేది ఉంటుందా లేదా అన్న కొత్త అనుమానాలు మాత్రం జోరుగా తెరపైకి వస్తున్నాయి.