భూమా అఖిల ప్రియ భర్తపై మరో కేసు.. తప్పించుకోవాలనే చేశాడా..!

Wednesday, October 9th, 2019, 12:09:44 AM IST

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై మరో కేసు నమోదయ్యింది. గతంలో ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళేందుకు ఆళ్లగడ్డ ఎస్ఐ రవికుమార్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి వచ్చారు. అయితే పోలీసులను గమనించిన భార్గవరామ్ వారికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన కారును వెంబడించిన పోలీసులు గచ్చిబౌలి లోని ఓక్ వుడ్ హోటల్ వద్ద కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే కారు ఆపుతున్నట్టుగా చేసి వేగంగా ఎస్ఐ పైకి దూసుకెళ్లారు భార్గవ రామ్.

అయియే తమ విధులకు ఆటంకం కలిగించి, తనను కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశారని ఆళ్లగడ్డ ఎస్ఐ రవికుమార్ భార్గవరామ్ మీద గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సారి జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గంగుల విజేంద్ర రెడ్డిపై ఓటమిపాలయ్యారు. అయితే ప్రచార సమయంలో, పోలింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య జర్గిన గొడవలకు పోలీసులు కేసులు కూడా పెట్టారు. అయితే తాజాగా ఆళ్లగడ్డ లోని క్రస్సర్ విషయంలో శివరామి రెడ్డి బృందానికి, భార్గవ లకు మధ్య జరిగిన గొడవలలో కొద్ది రోజుల క్రితం భార్గవ్ పై ఆళ్లగడ్డ పీఎస్ లో ఐపీసీ సెక్షన్ 143, 427, 447, 307, 507 ల కింద కేస్ నమోదయింది. ఈ కేసు విషయంలో అరెస్ట్ కోసం వచ్చిన ఎస్సై ఆయనపై గచ్చిబౌలిలో మరో కేసు పెట్టారు.