చంద్రబాబు నిర్ణయం ముమ్మాటికి తప్పే అంటున్న టీడీపీ నేత.. కానీ..!

Saturday, April 3rd, 2021, 10:26:36 PM IST

ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజులు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జ్యోతుల నెహ్రూ ఏకంగా టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, అశోక్ గజపతిరాజు ఏమో విజయనగరం జిల్లా టీడీపీ నాయకులతో చర్చలు జరిపి పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు నిర్ణయాన్ని మరో నేత తప్పుపట్టారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోకూడదని అన్నారు. చంద్రబాబు నిర్ణయం వ్యక్తిగతమని, దానిని నేను ఆమోదించడం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడానికి టీడీపీ అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. టీడీపీలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నిర్ణయం తప్పు అని చెప్పగలనని, కానీ చివరికి చంద్రబాబు ఆర్డర్ వేస్తే దానిని ఓకే చేస్తానని సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చారు.