తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి జంప్ అవుతున్న కీలకనేత..!

Tuesday, September 17th, 2019, 08:22:08 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వరుసగా రెండోసారి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన, లోక్‌సభ ఎన్నికలలో మాత్రం అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది.

అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలలో మరింత పట్టును పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఇప్పటికే టీడీపీనీ వీడి చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోయారు. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో కీలక నేత బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ తాజాగా బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అవ్వడంతో ఫిరోజ్ ఖాన్ బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి