ఊహించినట్లే అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే రేపటికి వాయిదా పడింది.అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. వివిధ పార్టీల నేతలు అంబటి బ్రాహ్మణయ్య ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.ఆయన విలువలతో కూడిన రాజకీయ నేత అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
అంబటి బ్రాహ్మణయ్య నీతికి నిజాయితికి కట్టుబడి ఉండే వ్యక్తి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన రాజీలేని పోరాటం చేశారని.. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో నిరాడంబరంగా జీవించిన వ్యక్తి అని…రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేశారన్నారు. అవనిగడ్డలో బ్రాహ్మణయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
విలువలకు కట్టుబడి జీవితాంతం బ్రాహ్మణయ్య ప్రజలకు సేవ చేశారని వైయస్ ఆర్ సిపి నేత విజయమ్మ అన్నారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన నిరాడంబరంగా జీవించారని ఆమె తెలిపారు.
అంబటి బ్రాహ్మణయ్య చిత్తశుద్దితో నిరంతరం తలెత్తుకుని జీవించిన వ్యక్తి అని లోక్ సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ అన్నారు. పాతతరానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి అని…పార్టీలకు అతీతంగా అందిరితో స్నేహంగా వ్యవహరించాన్నారు. రాజకీయాల్లో అంబటి బ్రాహ్మణయ్య లేని లోటు తీరనిదని బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు.
అంబటి బ్రాహ్మణయ్యకు సభ సంతాపం తెలిపిన కాసేటికే అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఎటువంటి ప్రజాసమస్యలు చర్చించకుండానే సభను స్పీకర్ వాయిదా వేశారు.