అమరావతి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన జగన్

Friday, June 14th, 2019, 01:24:11 AM IST

జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే చెప్పిన మాటని చెప్పినట్లు నెరవేరుస్తూ ముందుకి పోతున్నాడు. మరి రాబోవు రోజులు ఏమి చేస్తాడో తెలియదు కానీ, ఇప్పుడు మాట మీద నిలబడే మనిషిగానే కనిపిస్తున్నాడు. దాని వలన ప్రజలకి ఎంత లాభం అనే విషయాలు పక్కన పెడితే ప్రతిపక్ష టీడీపీ కి మాత్రం చాలా లాభం ఉంది. టీడీపీ నుండి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయంగా MLA లను తీసుకోనని జగన్ ప్రకటించటం చూశాం, ఆయన కూడా అదే మాట మీద ఉండే మనిషి.

తాజాగా అసెంబ్లీలో కూడా దానిపై మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలని, ప్రతిపక్ష నేత ఉండాలనే ఒకే ఒక ఆలోచనతో టీడీపీ MLA లను తీసుకోవటం లేదు. సభలో అధికారపక్షం, ప్రతిపక్షం ఉంటేనే సభ సక్రమంగా నడుస్తుందనే నమ్మకం నాకు ఉంది, అందుకే ప్రతిపక్ష హోదా టీడీపీ ఉండేలా చేస్తున్నాను అంటూ జగన్ మాట్లాడాడు. అమరావతిలో మాట్లాడిన ఈ మాటలు సరిగ్గా హైదరాబాద్ లో తగలాల్సిన వాళ్ళకి సరిగ్గా తగిలాయని తెలుస్తుంది. తెలంగాణలో అధికార తెరాస పార్టీ కాంగ్రెస్ నుండి 12 మంది సభ్యులను తమ పార్టీలోకి తీసుకోని సీఎల్పీని తెరాస లో విలీనం అయ్యేలా చేసుకున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీని ఇలాగే చేశారు. ఇలా తమకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలోని MLA లను తన అధికార బలంతో తమ వైపు తిప్పుకొని అసెంబ్లీ లో ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నాడు కేసీఆర్. కానీ జగన్ మాత్రం ప్రతిపక్షాన్ని గౌరవిస్తూ, తప్పనిసరిగా అసెంబ్లీ లో ప్రతిపక్షము ఉండాలని కోరుకుంటున్నాడు. మరి తన మిత్రుడైన జగన్ ని చూసి అయినా కేసీఆర్ లో ఏమైనా చలనం వస్తుందేమో చూడాలి..