కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం – వైఎస్ జగన్

Wednesday, April 28th, 2021, 01:55:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయం లో ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న వసతి విద్యా దీవెన పథకం ను ప్రారంభిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో ప్రతి విద్యార్థి భవిష్యత్ కి భరోసా కల్పిస్తాం అని వ్యాఖ్యానించారు. అంతేకాక రాష్ట్రం లో పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల నిర్వహణ పై పలువురు విమర్శలు చేస్తున్నారు అని, విపత్కర పరిస్థితుల్లో అగ్గి పెట్టాలని చూస్తున్నారు అని, విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్ల పైనే ఆధార పడి ఉంటుంది అని తెలిపారు. అయితే పరీక్షల నిర్వహణ కి అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని, పరీక్షలను నిర్వహించాలో వొద్దో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే పరీక్షలను నిర్వహించక పోతే సర్టిఫికెట్ల లో పాస్ అనే ఉంటుంది, ఆ పాస్ అనే సర్టిఫికెట్ల తో విద్యార్థులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో పరీక్షలు నిర్వహిస్తున్నాం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పని అని, పరీక్షల నిర్వహణ కోసం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు. జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహించడం కష్టతరమైన పని అని, కష్టమైనా, భారమైనా పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాం అని అన్నారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం అని ప్రతి విద్యార్థి తల్లి దండ్రులకు భరోసా కల్పిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే నేడు జగనన్న వసతి విద్యా దీవెన తొలి విడత కింద రాష్ట్రం లోని 10.89 లక్షల మంది విద్యార్థులకు 1,049 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.