నవరత్నాల ఆధారంగా అభివృద్ధి పనులు – ఏపీ ఉపముఖ్యమంత్రి

Thursday, July 11th, 2019, 01:02:37 AM IST

నేడు గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఐటిడిఎ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాములా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ఆధారంగానే ఏపీకి అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఆ శాఖకు నాలుగున్నరేళ్లపాటు మంత్రిని కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణమని పుష్ప శ్రీవాణి అన్నారు. అయితే ఏపీలో కొత్తగా అధికారంలోకి వచినటువంటి వైసీపీ ప్రభుత్వం గిరిజన సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఎస్టీ రైతులకు భూమి కేటాయించడంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామని చెప్పారు.

అంతేకాకుండ వారి సంక్షేమం కోసం అందరికి అనుకూలంగా ఉండేలాగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని, వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కింద గిరిజన వధువులకు రూ. లక్ష అందిస్తామన్నారు. అమ్మ ఒడి కింద 4.2 లక్షల ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.15వేల లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. అంతేకాకుండా ఏజెన్సీ ఏరియాలో గిరిజనులే వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులుగా అధికారాన్ని చేపట్టబోతున్నారని ప్రకటించారు. అందరి ఇళ్లల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. కాగా ఇప్పటివరకు కూడా గిరిజనుల సంక్షేమానికి ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇకపోతే బాలికల వసతి గృహాలకు రక్షణ కరువైందని, ఆ వసతి గృహాల చుట్టూ సీసీ కెమెరాలు అమర్చనున్నట్లు తెలిపారు.