సొంత పార్టీ నేతపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, September 18th, 2019, 04:27:27 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతో టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే తాజాగా టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

అయితే తోట పార్టీలో చేరిన ఈ కొద్ది రోజులలోనే ఆయనపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే గతంలో వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోటను కఠినంగా శిక్షించాలని దళితులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాశ్ చంద్రబోస్ ప్రభుత్వం తరుపున ఈ కేసు విషయంలో బాధితులకు అండగా ఉంటామని పార్టీలోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారని తోట ఏ పార్టీలో ఉన్న తనకెప్పుడు ఆయన శత్రువే అని అన్నారు. ఈ కేసు విషయంలో దళితులకు నా పూర్తి సహకారం ఉంటుందని, అవసరమైతే దళితులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసేందుకైనా తాను వెనుకాడబోనని తేల్చి చెప్పారు. అయితే తోటపై పిల్లి సుభాశ్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. తోట వైసీపీలోకి చేరడం పిల్లి సుభాశ్ గారికి ఇష్టం లేదని అందుకే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.