టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఏపీ సర్కార్ షాక్..!

Tuesday, June 30th, 2020, 08:02:14 PM IST


టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గల్లా జయదేవ్‌కి సంబంధించిన సంస్థ ‘అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్’ కంపెనీకు గతంలో కేటాయించిన 253 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఉమ్మడి ఏపీలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో అమర్ రాజా ఇన్‌ఫ్రా సంస్థకు చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నూనె గుండ్లపల్లి గ్రామాల్లో మొత్తం 483.27 ఎకరాలను కట్టబెట్టింది. ఆ ఒప్పందం ప్రకారం అమర్ రాజా కంపెనీ రెండేళ్లలో ఆ భూములను పూర్తిగా వినియోగించాల్సి ఉంటుందని ఒకవేళ అలా జరగకపోతే ఖాళీగా ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.

అయితే ఇప్పటివరకు అమర్ రాజా కంపెనీ మొత్తం 483.27 ఎకరాలలో 229.66 ఎకరాలు మాత్రమే ఉపయోగించుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే సంస్ధ విస్తరణ, ఎలాంటి ఉద్యోగాల కల్పన చేపట్టకపోవడంతో ఖాళీగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.