ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై హైకోర్ట్ కీలక నిర్ణయం.. సస్పెన్షన్ ఎత్తివేత..!

Friday, May 22nd, 2020, 10:23:43 PM IST

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసుపై ఏపీ హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసినప్పుడు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఫిబ్రవరి 8న సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ని ఆశ్రయించిన క్యాట్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్దిస్తూ ప్రభుత్వానికే మద్ధతు తెలిపింది. అయితే తాజాగా ఈ కేసుపై నేడు మరోసారి విచారణ జరిపిన హైకోర్ట్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేసింది. అంతేకాదు ఏబీనీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు కూడా చెల్లించాలని ప్రభుత్వానికి తెలిపింది.