ప్లాష్ ప్లాష్:: ఏపీ పోలీస్ వ్యవస్థపై నూతన హోమంత్రి సంచలన నిర్ణయం..!

Sunday, June 16th, 2019, 03:20:19 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ తన కేబినెట్‌ను కూడా ప్రకటించి వారితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అయితే తన మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పిస్తూ, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా తన మంత్రివర్గాన్ని ప్రకటించాడు. అయితే హోంశాఖ బాధ్యతలను దళిత మహిళా అయినటువంటి మేకతోటి సుచరితకు అప్పచెప్పారు.

అయితే పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఏపీ పోలీస్ వ్యవస్థపై సంచలన నిర్ణయం తీసుకున్నారు మేకతోటి సుచరిత. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగ దినాలు, ఆదివారాలు లేకుండా పనిచేసే పోలీసులకు ఇక ఇప్పటి నుంచి వీక్లీ ఆఫ్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగానే వారంలో ఒక రోజు పోలీసులకు కూడా సెలవు దినం ఉంటుంది. అంతేకాదు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను కాపాడుతూ, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని ఆమె చెప్పుకొచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని, మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేసి మహిళలకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని చెబుతూ, ప్రజలలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు.