డిజిట‌ల్‌పై యుద్ధం : మార్చి 1 నుంచి థియేట‌ర్లు బంద్‌?

Wednesday, January 31st, 2018, 03:57:21 PM IST

ఏపీ, తెలంగాణ స‌హా సౌత్‌లో మార్చి 1 నుంచి థియేట‌ర్ల బంద్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. నేడు కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండ‌ల్వుడ్ ఫిలింఛాంబ‌ర్ల ప్ర‌తినిధుల‌తో తెలుగు ఫిలింఛాంబ‌ర్ ప్ర‌తినిధులు భేటీ అయ్యారు. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల వ‌ల్ల నిర్మాత‌లు, ఎగ్జిబిటర్ల‌కు క‌లుగుతున్న నష్టంపై చ‌ర్చించారు. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తూ స‌వారీ చేస్తున్న వైనంపై అంతా సీరియ‌స్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇక ఈ ఆగ‌డాల్ని ఆప‌డ‌మే ధ్యేయంగా తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి, నిర్మాతల మండ‌లి కీల‌క భేటీలో మార్చి 3 నుంచి థియేట‌ర్ల‌ బంద్‌న‌కు పిలుపునివ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. టాలీవుడ్‌ పిలుపు మేర‌కు నేడు ఇరుగుపొరుగు ప‌రిశ్ర‌మ‌ల ఫిలింఛాంబ‌ర్‌ ప్ర‌తినిధులు టాలీవుడ్ ఫిలింఛాంబ‌ర్‌ కీల‌క స‌మావేశంలో చ‌ర్చ‌లు జరిపారు. క్యూబ్, యుఎఫ్‌వో, పిఎక్స్‌డి వంటి వాటికి ఛార్జీల బాదుడుపై స‌మీక్షించి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు నిర్మాత‌ల్ని దోచేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ తీసుకున్న నిర్ణ‌యానికి అంతా మ‌ద్ధ‌తు ప‌లికారు.

థియేట‌ర్ల బంద్ నిర్ణ‌యానికి.. ద‌క్షిణ‌భార‌త చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి, తెలంగాణ ఫిలింఛాంబ‌ర్‌, త‌మిళ‌నిర్మాత‌ల మండ‌లి, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండిల్వుడ్ ఫిలింఛాంబ‌ర్ల‌ మ‌ద్ధ‌తు ల‌భించింది. వీళ్లంద‌రితో పాటు, కేంద్ర ఫిలింఛాంబ‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్ల కౌన్సిల్ (అన్ని రాష్ట్రాలు) మ‌ద్ధ‌తు ప‌లికాయి. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల తో స‌మావేశం ఏర్పాటు చేసి వారం గ‌డువులో స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఒక‌వేళ రాజీకి రాక‌పోతే ఇక థియేట‌ర్ల బంద్ షురూ అయిన‌ట్టేన‌ని తెలుస్తోంది.