అరవింద సమేత మొద‌టి షో ఇష్యూ.. హాట్ టాపిక్‌గా మారిన సాయిమ‌హ‌ల్ థియేట‌ర్..!

Thursday, October 11th, 2018, 03:39:45 PM IST

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్ర‌కుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రం ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క్రేజీ కాంబినేష‌న్, భారీ బ‌డ్జెట్, విప‌రీత‌మైన అంచ‌నాల‌తో బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్ట‌డానికి వ‌చ్చిన అర‌వింద స‌మేత మొద‌టి షోనుండే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి మొద‌టినుండే విప‌రీత‌మైన క్రేజ్ ఉండ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద హ‌డావుడి ఎక్కువ‌గా ఉంది. అయితే ఈ నేప‌థ్యంలో అర‌వింద‌స‌మేత సినిమా టికెట్ల విష‌యంలో అభిమానుల మ‌ధ్య చిచ్చుపెట్ట‌డానికి టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నించార‌నే వార్త హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పాయ‌క‌రావుపేట‌ల సాయిమ‌హ‌ల్ థియేట‌ర్ ఉంది. ఆ థియేట‌ర్‌లో ఈరోజు అర‌వింద స‌మేత ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది.

అయితే ఆ థియేట‌ర్‌లో వైసీపీకి చెందిన వారికి టికెట్లు ఇవ్వొద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత థియేట‌ర్ యాజ‌మాన్యానికి చెప్పార‌ట‌. దీంతో ఈరోజు అర‌వింద స‌మేత చిత్రాన్ని మొద‌టి షో చూడ‌డానికి ఆ థియేట‌ర్‌కు..బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, వైసీపీకి చెందిన కార్య‌క‌ర్త విశ్వనాథుల శ్రీను మ‌రికొంత‌మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు వెళ్ళ‌గా థియేట‌ర్ యాజ‌మాన్యం టికెట్టు ఇవ్వ‌మ‌ని చెప్ప‌డంతో అక్క‌డ ఉధ్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇక‌పోతే చింతకాయ‌ల రాంబాబు, విశ్వ‌నాథుల శ్రీను ఇద్ద‌రూ టీడీపీ ఆవిర్భావం నుండి టీడీపీ వెంటే ఉన్నారు. అయితే ఇటీవ‌ల శ్రీను వైసీపీలోకి వెళ్ళారు. రాంబాబు మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. అయినా కూడా వారిద్ద‌రు నంద‌మూరి హీరోల పై మాత్రం విప‌రీత‌మైన అభిమానాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు విడుద‌ల అయిన అర‌వింద‌స‌మేత చిత్రం టికెట్లు వారికి దొర‌క‌క‌పోవ‌డంతో తీవ్రంగా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే తీరు పై జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.