ప్రధాని మోడీపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు

Friday, January 27th, 2017, 10:05:29 PM IST

Asaduddin-Owaisi
తమిళ ప్రజలు జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కదిలించింది. ఎంతో సంయమనంతో అక్కడి ఉద్యమాన్ని నడిపించిన యువత చివరికి తాము అనుకున్నది సాధించింది. అయితే ఇప్పుడు దీనిని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా చాలా ఉద్యమాలు బయలుదేరాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం ఇలాంటి ఉద్యమమే మొదలైంది. తాజాగా ఇప్పుడు కర్ణాటకలో కూడా కంబళ క్రీడను పునరుద్దరించాలంటూ అక్కడ యువత ఏకమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా తమిళ యువత స్పూర్తితో ట్రిపుల్ తలాక్ కు మద్దతుగా ఉద్యమించడానికి ముస్లిం యువత సిద్ధం కావాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం కోసం తమిళ ప్రజల నుండి స్ఫూర్తిని పొందాలని ఆయన ముస్లిం యువతకు సూచించారు. తమ సంప్రదాయం కోసం లక్షలాది ప్రజలు ఐకమత్యంగా ఆందోళన చేసారని, ప్రధాని మోడీ వారి ముందు మోకరిల్లాల్సి వచ్చిందని అన్నారు. తమిళుల మాదిరిగానే ముస్లిం లకు ఒక సంప్రదాయం ఉందని, మాకు నచ్చినట్టు మేము పెళ్లిళ్లు చేసుకుంటాం, విడాకులు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. మేము ఏం చేయాలో ఎవరూ మాకు చెప్పాల్సిన పని లేదని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు.