ఒకానొక సమయంలో సంజయ్ దత్ బిచ్చమెత్తుకున్నారట!

Friday, June 15th, 2018, 01:17:53 AM IST


బాలీవుడ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు హీరో సంజయ్ దత్. ఖల్ నాయక్ చిత్రం అద్భుత విజయం తరువాత అభిమానులందరూ ఆయన్ను ఖల్ నాయక్ అనే పిలుస్తుంటారు. అందులోని నాయక్ నహీ, ఖల్ నాయక్ హు మైన్ అంటూ సాగే పాట ఇప్పటికీ సూపర్ హిట్టే. అయితే ప్రస్తుతం ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సంజు. యంగ్ హీరో రణబీర్ కపూర్ సంజయ్ పాత్ర పోషిస్తున్నారు. సంజయ్ దత్ లో మనకు తెలియని అసలు కోణాన్ని, జీవితాన్ని ఇందులో చూపించబోతున్నట్లు చెప్పారు దర్శకులు రాజ్ కుమార్ హిరాణి. కొద్దిరోజుల క్రితం విడుదలయిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ చిత్ర ట్రైలర్ లో రణబీర్ కనపడలేదని, సంజయ్ కనపడ్డాడని పలువురు నెటిజన్లు ఆయనపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఒక్కొక్క పోస్టర్ విడుదల చస్తూ వస్తున్న చిత్ర యూనిట్ నేడు ఒక సంచలన పోస్టర్ విడుదల చేసింది. దీనిని విడుదల చేసింది రాజ్ కుమార్ హిరాణి. అయితే అది సంజయ్ బిచ్చమెత్తుకున్న ఫోటో, ఆ ఫొటోలో కనిపిస్తున్నట్లు సంజయ్ నిజంగానే రోడ్ల పై బిచ్చమెత్తుకున్నారని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చెప్పారు రాజ్ కుమార్.

ఒకానొక సమయంలో సంజయ్ డ్రగ్స్ కు బానిస అవడంతో ఆయన్ని చికిత్స నిమిత్తం కుటుంబం అమెరికా తీసుకెళ్లిందట. అక్కడ ఒక రిహాబిలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న సంజయ్, అక్కడినుండి తప్పించుకుని తన ఫ్రెండ్ వద్దకు వెళ్లేందుకు డబ్బులు లేక బిచ్చమెత్తుకున్నారట. సంజయ్ జీవితం చాలా ఒడిడుకులు ఎదుర్కొందని, అటువంటివి చెపితే చాలా మంది నమ్మరు కానీ అవి నిజాలని, వాటిని చాలావరకు చిత్రంలో చూపించినట్లు రాజ్ కుమార్ హిరానీ చెప్పారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం సంజయ్ దత్ మాదక ద్రవ్యాలకు అలవాటు పాడడం, తరువాత అక్రమ ఆయుధాలు కలిగివున్నందుకు జైలుకు వెళ్లిరావడం వంటివి కూడా ఆయన జీవితంలో జరిగాయి. ఇప్పటికే ట్రైలర్ తో విపరీతంగా అంచనాలను పెంచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న విడుదల కానుంది…