పవన్ అభిమానిపై బ్లేడుతో దాడి..శ్రీకాకుళంలో ఉద్రిక్తత..!

Friday, January 12th, 2018, 09:14:42 AM IST

అభిమానుల పేరుతో జరుగుతున్న గొడవలు ఆగడంలేదు. అభిమానులు హద్దులుదాటుతున్న ఘటనలు ఏపీలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. హద్దుల్లో ఉండసిన అభిమానం వెర్రిగా మారుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానిపై బ్లేడుతో దాడి జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన జరగగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జిల్లాలోని ఉరుషోత్తమ పురంలో అజ్ఞాతవాసి, జై సింహా చిత్రాల విషయంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మొదలై బ్లేడుతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది.

ఘటన గురించి తెలుసుకున్న పోలీస్ లు అక్కడికి చేరుకొని అభిమానులని చెదరగొట్టారు. గాయపడిన పవన్ కళ్యాణ్ అభిమానిని ఆసుపత్రికి తరలించారు. నిందితులని పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పలు మార్లు ఏపీ లో హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్యన తిరుపతికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఫ్లెక్సీల విషయంలో కూడా అభిమానుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి.