‘బాహుబ‌లి -2’ మొద‌టి రోజు రికార్డులు సేఫ్‌?

Friday, January 26th, 2018, 10:16:28 AM IST

`బాహుబ‌లి-2` రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. దేశంలో నంబ‌ర్ -1 వ‌సూళ్ల సినిమా.. డే-1 నుంచి డే-10 వ‌ర‌కూ వ‌సూళ్ల‌లో నంబ‌ర్ -1 సినిమా. అయితే ఈ రికార్డుల్ని కొట్టే సినిమా వ‌స్తుందా? అన్న ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కూ స‌మాధానం లేదు. మొన్న‌టికి మొన్న స‌ల్మాన్ భాయ్ న‌టించిన `టైగ‌ర్ జిందా హై` సైతం డే-1 రికార్డుల్ని స‌వ‌రించ‌లేక‌పోయింది. ఫుల్ ర‌న్‌లోనూ బాహుబ‌లి-2 రికార్డుల్ని ట‌చ్ చేయ‌లేదు ఆ సినిమా.

అయితే `ప‌ద్మావ‌త్‌` ఆ రికార్డుల్ని స‌వ‌రిస్తుందేమో? అన్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల వివాదాలతో వ‌చ్చిన ప్ర‌చారం నేప‌థ్యంలో `ప‌ద్మావ‌త్` సంచ‌ల‌నాలు ఉంటాయ‌నే అనుకున్నారంతా. అయితే `బాహుబ‌లి-2` రికార్డుల్ని ఈ సినిమా కూడా ట‌చ్ చేయ‌లేక‌పోయింది. ముఖ్యంగా డే-1 ఓపెనింగ్ రికార్డుల్ని అస్స‌లు ట‌చ్ చేయ‌లేక‌పోయింది. నిన్న రిలీజైన `ప‌ద్మావ‌త్‌` తొలిరోజు 18 కోట్లు నెట్ వ‌సూలు చేసింది. అంటే రెట్టింపు గ్రాస్ ఉన్నా.. 50 కోట్లు క‌ష్టం. `బాహుబ‌లి-2` మొద‌టి రోజు 100 కోట్లు వ‌సూలు చేసింది. అందులో స‌గం నెట్ ఉన్నా.. దానిని ట‌చ్ చేసిన‌ట్టు కాదు క‌దా? అంతేకాదు.. బాహుబ‌లి-2 మొద‌టి రోజు హిందీ వెర్ష‌న్ వ‌సూళ్లు- 38కోట్లు, టైగ‌ర్ జిందా హై డే-1 హిందీ వెర్ష‌న్ వ‌సూళ్లు 24 కోట్లు(నెట్‌). అమీర్‌ఖాన్ దంగ‌ల్ మొద‌టిరోజు 19 కోట్లు(నెట్‌) వ‌సూలైంది. ప్రీమియ‌ర్ల‌తో 5 కోట్లు కొల్ల‌గొట్టిన ప‌ద్మావ‌త్ కేవ‌లం 19 కోట్ల నెట్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. అయితే భ‌న్సాలీ సినిమాలు స్లో పాయిజ‌న్ త‌ర‌హా. వివాదాలు స‌ద్దుమ‌ణిగి ముందుకెళుతోంది కాబ‌ట్టి మునుముందు అంత‌కంత‌కు వ‌సూళ్లు పెరిగే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప‌ద్మావ‌త్‌కి ఉన్న పాజిటివ్ టాక్ తో ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో రికార్డులు అందుకునే ఛాన్సుంటుంది.