కొనసాగుతున్న ‘జైసింహ’ హవా

Friday, January 19th, 2018, 10:27:03 PM IST

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో, నిర్మాత సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘జైసింహ’. ఈ చిత్రానికి టాక్ పెద్దగా లేకపోయినా పండుగ సందర్భం, అందునా ప్రత్యర్థి చిత్రాలు విజయం సాధించకపోవడంతో బాలయ్యకు లక్కు కలసివచ్చినట్లయిందని అంటున్నారు. కంటెంట్ పరంగా చూస్తే ఇది యావరేజ్ చిత్రం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి భారీ పరాజయం, మరొక వైపు సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం కాస్త బెటర్ టాక్ సంపాదించినా గాని పబ్లిసిటీ, ప్రమోషన్ లేకనో, లేక థియేటర్ల కొరతవల్లనో ఆ చిత్రానికి కలెక్షన్లు ఆశించినంత రావడం లేదు. ఇక మిగిలిన రాజ్ తరుణ్ నటించిన రంగుల రాట్నం కూడా పరాజయం దిశగా నడుస్తోంది. ఇవన్నీ ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి కలిసివచ్చిన అంశాలుగా మారాయి. సంక్రాంతి పూర్తి అయినప్పటికీ స్కూళ్ళు, కాలేజీలకు ఆదివారం వరకు సెలవలు ఉండడంతో ఈ రెండు, మూడు రోజులు కలెక్షన్లు బాగుంటాయి. అందులోను ఈనెల 26 వరకు చిత్రాలేవీ విడుదల కాకపోతుండడం కూడా కొంత వరకు కలసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం 23 కోట్ల 30 లక్షల షేర్ రాబట్టిందని,మొత్తం థియేట్రికల్ రైట్స్ 28 కోట్లకు అమ్మారని, మిగిలినది తేలికగానే వఛ్చి కొద్దిగా లాభాలను కూడా తెచ్చిపెట్టే అవాకాశం వుందని అంటున్నారు. ఈ చిత్రం బాలయ్య చిత్రాల్లో ఒక అరుదైన రికార్డు కూడా నమోదు చేసింది. ఇదివరకు బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి 41 కోట్ల మొదటివారం షేర్ తో మొదటి స్థానం లోను, అలానే లెజెండ్ 27 కోట్ల 40 లక్షల షేర్ తో రెండవ స్థానం లో , ఇప్పుడు జైసింహ 23 కోట్ల 30 లక్షల షేర్ తో అయన కెరీర్లోనే మొదటివారం అత్యధిక షేర్ సాధించిన 3వ చిత్రంగా నిలిచింది. వాస్తవానికి ఈ చిత్రానికి ఏ సెంటర్లలో పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ, బి మరియు సి సెంటర్లలో మాత్రం మంచి ఆదరణతో నడుస్తుందని సమాచారం.