భరత్ అనే నేను టూ పార్ట్స్ ….

Friday, April 20th, 2018, 02:19:32 AM IST

మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భరత్‌ అనే నేను’. కైరా అడ్వానీ నాయిక. కొరటాల శివ దర్శకత్వం వహించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా గురువారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ కథ ఎప్పుడో రాసుకున్నాను. కథ విన్న మహేష్‌బాబు.. ‘ఎవరినీ నొప్పించకుండా ఇలాంటి కథ రాయడం చాలా కష్టం’ అన్నారు. కథలో లీనమయ్యాక… తన అత్యుత్తమ ప్రతిభని బయటకు తీసుకొస్తారాయన. మహేష్‌ అందించిన ప్రోత్సాహం మర్చిపోలేనిది. కైరా అడ్వాని కూడా తన సంభాషణలు ముందుగానే నేర్చుకుని సెట్లో అడుగుపెట్టేది. ఎప్పుడూ చూస్తున్న సినిమాలాంటిది కాదు. సాంకేతిక నిపుణులు, నటీనటులు అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. కానీ వాణిజ్య అంశాలూ ఉంటాయి. కథని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా పాటలు అందించారు రామజోగయ్య శాస్త్రి. ‘మనల్ని గౌరవించే సినిమా కావాలి.. సినిమా రిచ్‌గా ఉండాలి’ అని దానయ్య చెప్పారు. అలాంటి చిత్రమే తీశాం. రెండు భాగాలుగా తీయాల్సిన సినిమా ఇది. నాలుగు గంటల నిడివి వచ్చింది. దాన్ని మూడు గంటల్లో కుదించామ’’న్నారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘నిజాయతీతో కూడిన అద్భుతం ఈ చిత్రం. రెండు పాటల్ని చిత్రీకరించే సమయంలోనే చూశాను. మహేష్‌ నటన చాలా బాగుంది. వాణిజ్య అంశాలు ఉంటూనే మనల్ని ఆలోచనల్లో పడేసే చిత్రమిది. ‘ఓ వసుమతి’ పాటకు మంచి స్పందన వస్తోంది. అశ్వనీదత్‌గారు కూడా ఈ పాటని మెచ్చుకోవడం ఆనందంగా అనిపించింద’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘అందరూ గర్వించే సినిమా తీశాం. మహేష్‌తో సినిమా చేయాలన్న కోరిక ‘భరత్‌’ తీర్చింద’’న్నారు.

  •  
  •  
  •  
  •  

Comments