శ్రీ రెడ్డి పై బ్యాన్ ఎత్తివేత…”క్యాష్” కమిటీ ఏర్పాటు చేసిన ‘మా’

Thursday, April 12th, 2018, 09:42:37 PM IST


కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మాయిలను పలువిధాలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయమై ప్రస్తుతం తన నిరసనతో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి పై కొద్దిరోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఆమె తన నిరసనను కొనసాగిస్తూ పలు మీడియా చానెల్స్ కు వెళ్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరాం, దర్శకులు శేఖర్ కమ్ముల, కొరటాల శివ, రైటర్ కోన వెంకట్, వైవా హర్ష ఇలా పలువురి పేర్లు బయటపెట్టి పెద్ద కలకాలమే రేపింది. అయితే అందులో భాగంగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతుకోరిన ఆమె అభ్యర్ధనమేరకు నేడు ఓయూ జేఏసీ మా అసోసియేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది.

ఎట్టకేలకు ఆమె నిరసనకు దిగివచ్చిన మా అసోసియేషన్ ఆమె పై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నేడు ప్రకటించింది. ఈ సందర్భంగా మా సభ్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా అధ్యక్షులు శివాజీరాజా, ఇతర సభ్యులు జెమిని కిరణ్, సీనియర్ ఆక్టర్ నరేష్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆమెపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నామని, అలానే మీ కమిటీ లోని 900 మంది సభ్యులు ఆమెతో కలిసి నటిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. అంతే కాక టాలీవుడ్ లో మహిళా నటుల రక్షణకు క్యాష్ (కమిటీ ఎగైనెస్ట్ సెక్సువల్ హరాస్మెంట్) కమిటీ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఇది తను ఆశించిన పూర్తి ఫలితము కాదని, తను అనుకున్నది నెరవేరేవరకు దీన్ని ఇక్కడితో వదిలేది లేదని, ఈ నిరసనను మరింత ముందుకు తీసుకువెళ్తానని ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు….

  •  
  •  
  •  
  •  

Comments