ఎంపీ రఘురామను అరెస్టు చేసిన తీరు దారుణం – బండి సంజయ్

Saturday, May 15th, 2021, 08:21:50 AM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును నిన్న ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా మీడియా సమావేశాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంగా నిన్న హైదరాబాద్‌లో ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎంపీ రఘురామకృష్టంరాజును అరెస్ట్ చేసిన తీరు చాలా దారుణమని అన్నారు. ఒక ఎంపీని బలవంతంగా కారులోకి తోస్తారా అంటూ నిప్పులు చెరిగారు.

అంతేకాదు లోక్‌సభ స్పీకర్‌ అనుమతి లేకుండా ఓ పార్లమెంటు సభ్యుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందని బండి సంజయ్ ప్రశ్నించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో ఆపేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఎంపీని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను ఎలా అనుమతిచ్చిందని నిలదీశారు. ఏపీ సీఐడీ పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారని, పదుల సంఖ్యలో పోలీసులు ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి రావాల్సిన అవసరం ఏముందని బండి సంజయ్ అన్నారు.