తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంత్ శిరోమణి రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ దళితులే హిందూ ధర్మ రక్షకులని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్కు పేదల జయంతి కార్యక్రమాలు గుర్తుండవని విమర్శలు గుప్పించారు.
అంతేకాదు అంబేద్కర్, సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాలను ఎందుకు ప్రభుత్వం చేయదని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామన్న అంబేద్కర్ భారీ విగ్రహం ఎక్కడ అని, బీసీ ఆత్మగౌరవ భవనాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మోచీలకు చెప్పులు కుట్టడమే కాదు, మొలలు కొట్టడం కూడా వచ్చు అని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, దళితులందరూ ఏకతాటిపైకి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.