ఫూలన్ దేవి కుటుంబానికి ఎంత కష్టం..!!

Thursday, February 23rd, 2017, 05:45:56 PM IST


చంబల్ లోయ ప్రాంతాన్ని తన గుప్పెట్లో ఉంచుకుని పోలీస్ లను సైతం గడగడలాడించిన బందిపోటు రాణి ఫూలన్ దేవి కుటుంబం ప్రస్తుతం దీనస్థితిలో ఉంది. బందిపోటు రాణిగా, రెండు సార్లు ఎంపీగా ఆమె ఎన్నో ఆస్తులను కూడబెట్టి ఉంటుందని అనుకోవచ్చు. కానీ వస్తావ పరిస్థితి అదికాదు. ఆమె కుటుంబం ఇప్పుడు తిండికి గతిలేని స్థితిలో ఉంది. ఇటీవల ఓ సంస్థ కరువు ప్రాంతాలపై ఉత్తరప్రదేశ్ లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో భాగంగా ప్రతినిధులు కొందరు ఫూలన్ దేవి గ్రామం జలౌన్ కు వెళ్లారు. అక్కడ ఫూలన్ దేవి తల్లి మూలదేవి(70), చెల్లెలు రామ్ కలీ లను దీన స్థితిలో చూసిన ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.

ఎంపీగా పని చేసిన మహిళ కుటుంబం ఈ స్థితిలో ఉండడం చూసి వారు నమ్మలేక పోయారు. కరువు కోరల్లో ఉన్న ఆగ్రామంలో వారిద్దరూ దాదాపు చావుకు దగ్గరగా ఉన్నారు. వారి ఇంట్లో ప్రస్తుతం కొంత గోధుమ పిండి, పావు కిలో ఉల్లిపాయలు తప్ప మరేమి లేదు. వారి నెల ఆదాయం వింటే ఎంతటి కఠిన పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది.రామ్ కలీ ఉపాధి హామీ పనులకు వెళ్లి నెలకు రూ 300 – 400 వరకు తెస్తుంది. అంతకు మించిన ఆదయ మార్గం కానీ, పనికానీ వీరికి లేదు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన నాయకులు తనని సస్టేజి మీద నిలబెట్టి రూ 200 ఇస్తారని రామ్ కలీ తెలిపింది. ఆ తరువాత ప్రత్యర్థులనుంచి బెదిరింపులు రావడంతో అదికూడా మానేసానని ఆమె చెప్పింది.బందిపోటుగా ఉన్న ఫూలన్ దేవి 1983 లో పోలీస్ లకు లొంగిపోయింది. 1994 జైలు నుంచి విడుదలైన ఆమె రెండేళ్ల తరువాత మీర్జాపూర్ ఎంపీ గా గెలిచారు.ఆతరువాత 1999 లో కూడా మరో మారు గెలుపొందారు. 2001 లో ఆమె అధికారిక నివాసంలో జరిగిన కాల్పుల్లో ఫూలన్ దేవి మరణించింది.ప్రస్తుతం ఆమె కుటుంబాన్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు.