‘పద్మ విభూషన్’కు బాపు పేరు ప్రతిపాదన

Monday, September 15th, 2014, 10:01:51 AM IST


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం మంత్రివర్గ సమావేశంలో ‘పద్మ’ పురస్కారాల కోసంప్రముఖుల పేర్లను ఖరారు చేయనుంది. దీని ప్రకారం ప్రముఖ దివంగత దర్శకుడు బాపును ప్రతిష్టాత్మకమైన ‘పద్మ విభూషణ్’ పురస్కారానికి గాను ప్రభుత్వం ప్రతిపాదించనున్నట్లు సమాచారం. అలాగే బాపుతో పాటుగా ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, గాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిల పేర్లను కూడా ప్రభుత్వం ప్రతిపాదించనుంది.

ఇక దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయిన నందమూరి తారక రామారావు పేరును ‘భారత రత్న’ పురస్కారానికి ప్రతిపాదించనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే ‘పద్మ భూషణ్’ పురస్కారాల కోసం తెలుగుదేశం ఎంపీ మరియు ప్రముఖ నిర్మాత, నటుడు మురళీ మోహన్ పేరును ఏపీ సర్కారు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటుగా పద్మ భూషణ్ అవార్డుల కొరకు కర్నాటిక్ వోకలిస్ట్ నేదునూరి కృష్ణమూర్తి, సనాతన ధర్మ కోవిదుడు చాగంటి కోటేశ్వరరావుల పేర్లను ప్రభుత్వం సూచించనుంది.