దీదీని ఆడుకోవ‌డం మొద‌లుపెట్టిన మోదీ!

Monday, June 10th, 2019, 02:50:59 PM IST

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అలియాస్ దీదీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గేమ్ ప్లాన్ మొద‌లైంది. గ‌త కొంత కాలంగా మోదీని టార్గెట్ చేస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎలాగైనా ఆమెకు బుద్ధి చెప్పాల‌ని ఆట నిర్ణ‌యించుకుని మెల్ల మెల్ల‌గా ఆట మొద‌లుపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. సీఎంని గ‌ద్దె దించాలంటే ఒక్క‌టే అస్త్రం శాంతి భ‌ద్ర‌త‌లు. దీన్ని సాకుగా చూపిస్తూ దీదీని మోదీ ఓ ఆట ఆడుకోబోతున్న‌ట్లు ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రుగుతున్న నాట‌కీయ ప‌రిణామాలు చూస్తే అర్థ‌మ‌వుతోంది.

గ‌త కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో ఏదో ఓ చోట హింస జ‌రుగుతూనే వుంది. దీన్ని సాకుగా వాడుకుని ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ఆ పీఠం నుంచి దించ‌డానికి అప్పుడే పావులు క‌ద‌ప‌డం మొద‌లుపెట్టారు బీజేపీ మాస్ట‌ర్ మైండ్ అమిత్ షా, ప్ర‌ధాని మోదీ. దీని కోసం కేంద్ర హోమ్ శాఖా అడ్వైజ‌రీని రంగంలోకి దింపారు. ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో విఫ‌ల‌మైంద‌ని కేంద్ర హోమ్ శాఖా అడ్వైజ‌రీ ఇటీవ‌లే ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో త్వ‌ర‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి రాష్ట్ర ప‌తి పాల‌ర విధించ‌బోతున్నామంటూ ఇండైరెక్ట్‌గా సంకేతాల్ని అందించింది. ఇందు కోసం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ కేస‌రి నాథ్ త్రిపాఠీని సోమ‌వారం ఢిల్లీ రావాల్సిందిగా కేంద్ర హోమ్ శాఖా అడ్వైజ‌రీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప‌శ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర ప‌తి పాల‌న ఖాయ‌మ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దీనిపై దీదీ ఎలా స్పందిస్తుందో చూడాలి.