రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచుతున్నారు.. సీఎం కేసీఆర్‌పై భట్టి ఫైర్..!

Thursday, April 8th, 2021, 03:03:07 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిడుమనూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. సీఎం కేసీఆర్ 5 లక్షల కోట్లకు తెలంగాణను తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని, రాష్ట్రాన్ను మద్యం మత్తులో ముంచుతున్నాడని ఆరోపించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పారే ప్రతినీటి బొట్టు, పండే ప్రతి కంకిలోనూ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోందని భట్టి చెప్పుకొచ్చారు.

అయితే జానారెడ్డికి పదవులు, హోదాలు కొత్త కాదని కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే జానారెడ్డి అసెంబ్లీలో ఉండడం ప్రజలకు అవసరం అని భట్టి అన్నారు. చట్ట సభల్లోనే ఉద్యోగాలు ఇవ్వనని మాట్లాడిన కేసీఆర్ ఎన్నికల వేళ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని అన్నారు. ఉద్యోగాల సాధన కోసం ఆత్మార్పణలు చేసుకుంటున్న యువతకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సరైన అవకాశమని, జానారెడ్డిని గెలిపించి కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. డబ్బు వెదజల్లు ఓట్లు కొనాలని చూసే కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని భట్టి అన్నారు.