విశ్లేషణ: తెలంగాణలో పెరిగిన బీజేపీ గ్రాఫ్.. సక్సెస్ మాత్రం కష్టమే?

Wednesday, November 20th, 2019, 05:54:54 PM IST

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ మెల్ల మెల్లగా పెరుగుతుందనే చెప్పాలి. దాదాపు ఏడాది క్రితం తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండో సారి విజయం సాధించింది. అయితే అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగిన టీఆర్ఎస్‌కు కాస్త చేదు అనుభవమే మిగిలింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో 16 స్థానాలను గెలుస్తామని కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చక్రం తిప్పుతామని కేసీఆర్ చెప్పినప్పటికి అది జరగలేదు. టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలనే గెలుచుకోవడం. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 4 స్థానాలను గెలుచుకుంటే, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకుంది.

అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికలలో మాత్రం ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అంతేకాదు సీఎం కేసీఆర్ కూతురు కవితను కూడా ఈ సారి బీజేపీ ఓడించడం మరో విశేషం. అయితే కేంద్రంలో ఎలాగో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలలో మరింత పట్టును పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మొదలుపెట్టింది. తెలంగాణలో సీనియర్ నాయకులను, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటూ ఎక్కడికక్కడ తమ అధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది.

అయితే సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టి, అటు కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ఎలాగైనా తెలంగాణలో తాము నిలబడాలనే లక్ష్యంతో మోదీ, అమిత్ షా ఇప్పటి నుంచే మళ్ళీ వ్యూహాలు మొదలుపెట్టారు. ఇక్కడి క్యాడర్‌కు, నాయకులకు తమ సలహాలతో ఎప్పటికప్పుడూ వారిని యాక్టివ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి నాలుగు ఎంపీ సీట్లు గెలిచినా కూడా అనుకున్న స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రజల మనసుల్లో బీజేపీ తన ముద్రను వేసుకోలేకపోతుంది. అయితే బీజేపీ తరుపున గెలిచిన ఎంపీలలో కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయనకు కీలక పదవి అప్పచెప్పినప్పటికి కూడా రాష్ట్ర ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే కొద్ది రోజుల నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు వినిపిస్తున్నప్పటికి కూడా దీనిపై అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ మాత్రం తన నాయకత్వంలోనే రాష్ట్ర బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచిందని, మళ్ళీ తనకే అవకాశం కల్పించాలని హైకమాండ్‌ను కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక పక్క కాంగ్రెస్ కూడా పుంజుకునేందుకు పీసీసీనీ మార్చే ప్రయత్నాలు చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తరువాత రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ అనే చెప్పవచ్చు. అయితే దానిని వెనక్కినెట్టి టీఆర్ఎస్‌తో తలపడి గెలవాలంటే బీజేపీకి అంతా అషా మాషీ కాదు. పార్టీలో ఎంతమంది నాయకులను చేర్చుకున్నా అది పార్టీకి బలాన్నిస్తుందేమో కానీ అది పార్టీ గెలుపుకు ఉపయోగపడదనే చెప్పాలి.

ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. బీజేపీ పార్టీ గురుంచి, కేంద్రంలో బీజేపీ ప్రవేశపెడుతున్న పథకాల గురుంచి ప్రజలలో అవగాహన కల్పించి వాటి ద్వారా ప్రజలకు లబ్ధీ చేకూర్చాలి. అప్పుడే బీజేపీపై ప్రజలలో ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు మాత్రం ఎంతసేపు పార్టీలో ఎవరెవరు చేరుతారు, ఎవరెవరిని చేర్చుకోవాలని చూస్తున్నారు తప్పా పార్టీనీ ప్రజల ముందుకు తీసుకెళ్ళి, బలంగా బీజేపీ వాయిస్ మాత్రం వినిపించడంలేదనే చెప్పాలి.

అయితే లోక్‌సభ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఇక వచ్చేసారి ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే మొన్న జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో బీజేపీ గ్రాఫ్ ఏంటో తేటతెల్లమయ్యింది. అక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ మూడో స్థానంలో అయినా నిలుస్తుందని అనుకుంటే కనీసం ఒక ఇండిపెండెంట్‌కి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. అయితే త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా బీజేపీ పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం వచ్చే ఎన్నికలలో సక్సెస్ అవ్వడమనేది ఇంపాజిబుల్ అనే చెప్పాలి.