బిగ్ వైరల్: ఒకే ప్లెక్సీలో జగన్, చంద్రబాబు ఫోటోలు..!

Tuesday, October 15th, 2019, 07:00:31 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని ముఖ్య నేతలంతా ఇతర పార్టీలలోకి వెళ్ళిపోవడంతో చాలా చోట్ల పార్టీనీ ముందుండి నడిపించే నాయకులు కనబడడంలేదు. అయితే నాయకులు ఉండి, ఈ సారి గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో కనిపిస్తుంది. అయితే తాజాగా ఒక ప్లెక్సీ వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.

అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేసిన ఒక బ్యానర్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారింది. టీడీపీ అభిమానులు పూడి రామకృష్ణ, మేడిశెట్టి శ్రీనివాస్‌, కట్టా పవన్‌కల్యాణ్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఫోటోలతో పాటు వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా పది వేల రూపాయలు అందిస్తున్న సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ జగన్ ఫోటోను కూడా అందులో వేయించారు. అంతేకాదు నియోజకవర్గ ప్రజలకు దీపావళి, నాగులచవితి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఈ ప్లెక్సీపై మాత్రం టీడీపీ ఎమ్మెల్యే తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకున్నా, దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.